దూడలకు ఉచితంగా పెగు పురుగుల నివారణ మందుల పంపిణీ
వారం రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడలకు ఉచితంగా పెగు పురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు దూడల ఎదుగుదల మెరుగుపడేలా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ పండరి మాట్లాడుతూ.. దూడల్లో పెగు పురుగుల సమస్య కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సరైన సమయంలో నివారణ మందులు అందించడం వల్ల దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయని తెలిపారు.
పశువుల పెంపకందారులు తమ దూడలకు తప్పనిసరిగా ఈ మందులు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం వారం రోజులపాటు కొనసాగుతుందని, మండలంలోని పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దూడలకు ఉచితంగా మందులు వేయించుకోవాలని కోరారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏవైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎఫ్‌బీఓ రాములు, ఎంపీఓ రాము తదితరులు పాల్గొన్నారు.