నిర్వహణ కమిటీ ఎన్నిక ఎప్పుడు?

02-10-2026 | 10:16pm

సత్తుపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): సత్తుపల్లి(Sattupalli) పట్టణంలోని స్థానిక ఉర్దూ అరబిక్ మదర్సా దారుల్ ఉలూమ్ మహమ్మదీయ నిర్వహణ కమిటీ కాల పరిమితి ముగిసి నెలరోజులు కావస్తున్నప్పటికీ నూతన కమిటీ ఎన్నిక ఇంతవరకూ చేపట్టలేదు. కనీసం ఇంత సమయంలోగా ఏర్పాటు చేస్తామన్న సమాచారం కూడా ఇవ్వడం లేదు.

పట్టణానికి చెందిన ఒక మైనారిటీ బిఆర్ఎస్ నాయకుడి కనుసన్నల్లోనే మదర్సా మహమ్మదీయ దారుల్ ఉలూమ్ నిర్వహణ నూతన కమిటీ ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందని సత్తుపల్లి పట్టణంలో చర్చించుకుంటున్నారు. నిరుపేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ధార్మిక విద్య నేర్పించడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ మదర్సా దారుల్ ఉలూమ్ మహమ్మదీయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లేదనే ఆరోపణలు గతంలో వచ్చినవిషయంతెలిసిందే.

అటువంటి ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సంజాయిషీ ప్రజలకు ఇవ్వకపోగా తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ నాయకుడు మదర్సా నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడంలో కావాలనే జాప్యం చేస్తున్నాడని సత్తుపల్లి పట్టణంలో ముస్లింలు చర్చించుకుంటున్నారు.

మదర్సాకు సంబంధించిన లక్షల రూపాయల ఆదాయ, వ్యయాలు, షాపు కిరాయిలు అన్నీ నిర్వహణ కమిటీతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయని, కమిటీ ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగితే సమాధానం దాటవేస్తూ, తమ అనుయాయులకు లబ్ది చేకూర్చాలని చూస్తున్నారు అని సత్తుపల్లి పట్టణంలో ముస్లింలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మదర్సా నూతన కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించి మదర్సా లో ఉన్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు