గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
కరీంనగర్ క్రైం, నవంబర్3 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మహమ్మద్ మున్న, మహమ్మద్ షారుక్ లను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిద్దరు గత కొంతకాలంగా మహారాష్ట్ర , ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తక్కువ ధరకు కొని కరీంనగర్ తీసుకు వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి సేవిస్తున్న విద్యార్థులకు, ఇతరులకు అమ్ముతూ అక్రమార్జన చేస్తున్నారు.
15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ కి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలోకి 20,000/- రూపాయల చొప్పున 2.200 KG ల గంజాయి కొని, రేకుర్తికి తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి కిలో గంజాయికి 50,000/- రూపాయల చొప్పున అమ్మడానికి సిద్ధం చేశారు. ఒక చేతి సంచిలో గంజాయిని తీసుకొని రేకుర్తిలోని సమ్మక్క గద్దెల వద్ద కెనాల్ కాల్వ వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. అనుమానం వచ్చి వారిని పట్టుకుని, విచారించగా సంచిలో ఉన్న రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షం లో పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి గంజాయి, సెల్ ఫోన్లు సీజ్ చేసి, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.