వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు
ముకరంపుర, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ఆదివారం కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు ప్రాంతాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(City Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి సంయుక్తంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. నగరంలోని 52, 53, 59, 60, 64వ డివిజన్లతో పాటు సాయినగర్, కాశ్మీర్ గడ్డ, ముకరంపుర, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల నుండి నీరు త్వరగా పోయేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ నీరు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాబోయే వర్షాకాలం నాటికి ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తామని వెల్లడించారు. డిఆర్ఎఫ్ బృందాలు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ కార్మికులు, జవాన్లు అంతా కలిసికట్టుగా శ్రమించి ఎక్కడా నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు. ఈ పర్యటనలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, కొంపెల్లి శ్వేత-రామన్, మాజిద్ హుస్సేన్, ఇబ్రహీం, పడాల శ్రీజ- అజయ్, బీజేపీ నాయకులు కటకం లోకేష్ కుమార్, మరియు అధికారులు పాల్గొన్నారు.