అమ్మవారి దర్శనం నుంచి వస్తుండగా మృత్యుఒడి

24-10-2026 | 11:17am

హుజురాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): దైవదర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం (Road Accident) విషాదంలో ముంచింది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వస్తుండగా విధి వక్రించింది. హుజురాబాద్ మండలం రంగాపూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పలువురు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఎర్టిగా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో హుజురాబాద్ మండలం రంగాపూర్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది (Collision). ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం అత్యవసర అంబులెన్స్ సేవల (Emergency Services) ద్వారా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారంతా రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినవారిగా గుర్తించారు.

అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఈ ప్రమాద వార్త పిడుగుపాటుగా మారింది. సంతోషంగా సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం క్షణాల్లో విషాదాంతం కావడంతో రామగుండం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణ సీఐ కరుణాకర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు