కంటెంట్ ఉంటే హిట్ పక్కా.. టీమ్ ధీమా!

24-10-2026 | 12:03pm

శ్రీ వినాయక వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఎస్. నరేష్ దర్శకత్వంలో శ్రీమతి బి. కళావతి కన్నడలో నిర్మించిన చిత్రం ‘ఇనియన్ ఆత్మ’. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రతిరూపం’ పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ (Pre-Release) వేడుకకు ప్రముఖ నటి కె. దివ్యవాణి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్రబృందం మొత్తం బెంగళూరు నుంచి తరలివచ్చింది.

చిత్ర నిర్మాత శ్రీమతి బి. కళావతి, దర్శకుడు నరేష్, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బి. సుస్మిత, ‘రేణుక-ఎల్లమ్మ’ సీరియల్ ఫేమ్ అనన్య వి.ఎస్., నయన, మధుశ్రీ, మంత్రవాది ఆది, రవి కిరణ్, కిట్టు ఈ వేడుకలో పాల్గొని, తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కన్నడ సినీ పరిశ్రమతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆత్మీయంగా నెమరువేసుకున్న దివ్యవాణి, చిత్రబృందంతో కన్నడలో అనర్గళంగా మాట్లాడారు. ‘ప్రతిరూపం’ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు భాషాభేదం ఉండదని, కంటెంట్ (Content) బాగుంటే బ్రహ్మరథం పడతారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అతిథులకు, చిత్రబృందానికి నిర్మాత శ్రీమతి బి. కళావతి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తెలుగులో నేరుగా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు