5 September, 2026 | 7:28 PM

యూరియా కొరతపై సభ్యుల ఆగ్రహం

05-09-2026 | 05:35pm

తాడువాయి సింగిల్‌ విండో మహాజన సభలో..

పాల్గొన్న సింగిల్‌ విండో పాలకవర్గం, రైతులు

• తాడువాయిలోనే యూరియా కొరత ఎందుకు వస్తుంది..?

• నిలదీసిన సభ్యులు..

తాడువాయి, సెప్టెంబర్‌ 05 (విజయక్రాంతి): యూరియా కొరత9Urea shortage)పై తాడువాయి సింగిల్‌ విండో మహాజన సభలో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో శనివారం చైర్మన్‌ నల్లవెల్లి కపిల్‌రెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు.

ఈ సభలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరా చేయడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా లేని యూరియా కొరత తాడువాయిలోనే ఎందుకు వస్తుందని సింగిల్‌ విండో పాలకవర్గాన్ని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడుతుందని వాపోయారు.

రైతులకు యూరియా సరఫరాలో వ్యవసాయ అధికారి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొరతకు వ్యవసాయ అధికారి సైతం కారణమని తెలిపారు. సీఈవో నర్సింలు నిర్లక్ష్యం వల్ల సొసైటీ నాశనమవుతుందని సభ్యులు మండిపడ్డారు. హమాలీలకు సొసైటీ నుంచి ఎలా డబ్బులు డ్రా చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. రైతులకు అవసరమైన యూరియా కోసం వెంటవెంటనే ఎందుకు డబ్బులు కట్టడం లేదని సభ్యులు ప్రశ్నించారు.

ఈ విషయమై సింగిల్‌ విండో చైర్మన్‌ కపిల్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను సొసైటీ చైర్మన్‌గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వచ్చానన్నారు. గతంలో అప్పుల్లో ఉన్న సొసైటీని అప్పుల నుంచి విముక్తి చేశానని తెలిపారు. రైతుల రూ.2.95 కోట్లుగా ఉన్న పంట రుణాలను రూ.8.60 కోట్ల రుణాలకు పెంచానని తెలిపారు. సీ గ్రేడ్‌లో ఉన్న సొసైటీని ఏ గ్రేడ్‌లోకి తీసుకువచ్చానని వివరించారు. యూరియా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ ఆకిటి ధర్మారెడ్డి, సర్పంచులు, డైరెక్టర్లు అంబీర్‌ శ్యామ్‌రావు, రమణారెడ్డి, నర్సింలు, గణేష్‌, బాపురావు, నాయకులు మంగారెడ్డి, ఆకిటి వెంకట్‌రామ్‌రెడ్డి, ముదాం నర్సింలు, రాజేశ్వర్‌రెడ్డి, రాజుగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, రాములు, సీఈవో నర్సింలు, సిబ్బంది నితేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, బాల్‌కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు