బహుజన రాజ్యాధికారమే లక్ష్యం
జనగామ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): బహుజన రాజ్యాధికారమే(bahujana rajyadhikara) లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం(Telangana Sarvajana Democratic Forum) ఆధ్వర్యంలో జనగామలో సమాలోచన చర్చ వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని గ్లోరీ ఫంక్షన్ హాల్ లో కన్నా పరశరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీ రాజ్(Prithvi Raj) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులయ్యారని, నేటికీ బహుజనులకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బహుజనులంతా ఏకమై రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే అంబేద్కర్ ఆశించిన సమసమాజం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం సలహాదారు రేపల్లె నరోత్తమ సూరి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు, మహాజన సేన నాయకులు శ్రీనివాస్ యాదవ్, న్యాయవాది రాగళ్ళ శ్రీహరి, మాచర్ల బిక్షపతి, ధరావత్ శంకర్ నాయక్, దుర్గ ప్రసాద్, జితేందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.