విద్య, వైద్యం, ఉపాధి అంశాలను చర్చాంశాలుగా చేర్చాలి

13-09-2026 | 12:41pm

జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగాం జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరగనున్న దిశా సమావేశం(DISHA Meeting)లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన విద్య, వైద్యం, ఉపాధి అంశాలను చర్చాంశాలుగా చేర్చాలని నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి వరంగల్ లోక్ సభ సభ్యురాలు, జనగాం జిల్లా దిశా కమిటీ అధ్యక్షురాలు కడియం కావ్య దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. దీనిపై కడియం కావ్య సానుకూలంగా స్పందించారు. జనగాంకు మంజూరైన అత్యాధునిక సాంకేతిక కేంద్రానికి త్వరితగతిన శంకుస్థాపన చేయాలి. జనగాంకు కాకతీయ సాంకేతిక కళాశాల మంజూరు చేయాలి.

యంగ్ ఇండియా సమీకృత ఉన్నత పాఠశాల, తెలంగాణ ప్రజా పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లను జనగాం జిల్లాకు మంజూరు చేయాలి. జనగాం ప్రాంతీయ వైద్యశాలలో అయస్కాంత ప్రతిధ్వని పరీక్ష (MRI) సౌకర్యం తో పాటు ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలి. లింగాల ఘనపురం మండలం కల్లెం గ్రామంలోని వస్త్ర పరిశ్రమల పార్కును అభివృద్ధి చేసి చేనేత పరిశ్రమలను తీసుకువచ్చి స్థానిక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి. పై అంశాలపై సమావేశంలో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నామని బిర్రు ఇస్తారి తెలిపారు.

మరిన్ని వార్తలు