బ్రిక్స్ ఆర్థికశక్తిగా ఎదుగుతుందా!
డా.తిరునహరి శేషు :
ప్రపంచ వాణిజ్యం(World Trade) ఇప్పుడు సుంకాల సుడిగుండంలో చిక్కుకుం ది. ఒక వైపు వాణిజ్య ప్రతీకారాలు, మరోవైపు యుద్ధ ఉద్రిక్తతలు.. ఈ అనిశ్చితి మధ్య ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం(BRICS Summit) ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చైర్మన్ హోదాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Indian Prime Minister Narendra Modi) చేసిన వ్యాఖ్యలు ‘బ్రిక్స్’ ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. సదస్సుకు ముం దు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
‘బ్రిక్స్’దేశాలు, వాటితో వాణిజ్యం చేసే దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు(Tariffs) విధిస్తానని, తద్వారా చిన్న గ్రూప్ కనుమరుగవుతుందని నిష్టూరమాడిన నేపథ్యం లో వెలువడిన ఢిల్లీ డిక్లరేషన్ మరింత ప్రా ధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ డిక్లరేషన్‌ను అమెరికాతోపాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనించాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వేదికగా మాత్రమే కనిపించిన ‘బ్రిక్స్’.. మారుతున్న ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో ప్రత్యామ్నాయ ఆర్థిక, వాణిజ్యశక్తిగా ఎదగగలదా అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటైన బ్రిటన్ వుడ్స్ కవలలు (ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ), 1975లో ఏర్పాటైన జి7 కూటమి, 1995లో ఆవిర్భవించిన డబ్ల్యూటీఓ ప్రపంచంలో శక్తివంతమైన వ్యవస్థ లుగా ఎదిగాయి. అయితే 2006లో నాలు గు సభ్య దేశాలతో ఆవిర్భవించిన ‘బ్రిక్స్’ కూటమి క్రమంగా విస్తరిస్తూ చైనా, భారత్, రష్యా(China, India, Russia) సహా 11 సభ్య దేశాలతోపాటు మ రొక పది భాగస్వామ్య దేశాలతో కూడిన బలమైన కూటమిగా ఎదుగుతుంది. ప్ర పంచ జనాభాలో సుమారు 50 శాతం వా టా, జీడీపీలో దాదాపు 40 శాతం వాటా, అంతర్జాతీయ వాణిజ్యంలో 26 శాతం వాటాను కలిగి ఉన్న బ్రిక్స్ కూటమి భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన వేదికగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్రిక్స్ మరింత బల పడితే అమెరికా ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ట్రంప్ భావిస్తు న్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలోనూ బ్రిక్స్‌తో పాటు దాని సభ్య దేశాలపై ఆర్థిక, వాణిజ్యపరమైన ఇబ్బందులు కలిగించే నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రిక్స్ వ్యవస్థాపక సభ్య దేశమైన బ్రెజిల్ విషయంలోనూ అగ్రరాజ్యం వైఖరి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తు త బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డాసిల్వాను గద్దె దింపి, తన చెప్పుచేతుల్లో ఉండే మాజీ అధ్యక్షుడు జైర్ బోల్స్ నారోకు అధికారం కట్టబెట్టేలా ట్రంప్ వ్యూహాత్మకంగా పావు లు కదుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
బ్రిక్స్ దేశాలు తమ స్వదేశీ కరెన్సీలో వ్యాపారం చేసినా, సొంత కరెన్సీని ప్రకటించినా, డిజిటల్ కరెన్సీలో వ్యాపారం చే సినా అది భవిష్యత్తులో డాలర్‌కు కష్టాలు తెచ్చిపెడుతుందని ట్రంప్ విశ్వసిస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఏ దేశాలపై విధించని విధంగా బ్రెజిల్, భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. ఇప్పటికే భారత్, రష్యాలు డాలర్‌ను పక్కన పెట్టి రూపీ, రూబల్‌తో వ్యాపారం చేస్తున్నాయి. ఇదే విధానం మరికొన్ని దేశాలకు విస్తరిస్తే అది డాలర్ ఆధిపత్యానికి గండికొడుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.
ఇంధన భద్రత, స్వేచ్ఛాయుత నౌకా రవాణా, దు రాక్రమణలు, చర్చల ద్వారానే శాంతియు త ప్రయోజనాలను సాధించాలనే అంశాలపై బ్రిక్స్ సమావేశం తీర్మానాలు చేయ టం.. ఇరాన్, యూఏఈలను ఒకే వేదికపైకి తీసుకురావడం పుండు మీద కారం చల్లినట్లుగా అమెరికా భావిస్తోంది. బ్రిక్స్ సద స్సులో దురాక్రమణాలపై, ఇంధన భద్రత పై తీర్మానాలు ఆమోదించిన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై 100 శాతం ట్యారి ఫ్‌లు విధించే ‘ది లిండ్సే ఓ గ్రాహం సాక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ -2026’ చట్టాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించటడం చూస్తుంటే బ్రిక్స్ దేశాలపై ముఖ్యంగా రష్యా, చైనా, భారత్‌పై అమెరికా వైఖరిని స్పష్టం చేస్తుంది.
అమెరికా మాత్రం వెనిజులా అధ్యక్షుడిని చెరప ట్ట వచ్చు ,ఆ దేశ ఇంధన వనరులను కొల్లగొట్టవచ్చు, ఆ దేశంతో ఇంధన ఒప్పందాలు చేసుకోవచ్చు.. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటానికి అమెరికాకు ఎందుకు అభ్యంతరా లు? ఇది అమెరికా నియంతృత్వ వైఖరికి అద్దం పడుతుంది. భారత్ రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ‘రష్యా, భారత్‌లు డెడ్ ఎకానమీలు కలిసి మునిగిపోనివ్వండి’ అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
బ్రిక్స్ కూటమిలోని రష్యా, చైనా, భార త్, దక్షిణాఫ్రికా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధాలతో పా టు సాంకేతిక సహకారం భవిష్యత్తులో మరింత బలపడితే, ఈ కూటమి ప్రపంచంలో మరో బలీయ సమాంతర శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ము ఖ్యంగా రష్యా, చైనా భారత్ (ఆర్‌ఐసీ) మధ్య వాణిజ్య, రక్షణ సంబంధాలు బలపడితే ఈ మూడు దేశాలు ఆర్థికంగా మ రింత పుంజుకునే అవకాశం ఉంది.
బ్రిక్స్ కూటమి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భారత్.. గ్లోబల్ సౌత్ విధానాలను కేవలం అనుసరించే దేశంగా కాకుండా, ఆ విధానాలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తోంది. అదే సమయంలో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యత పెరగాలని, ప్ర పంచ వ్యవస్థ ఏకధ్రువంగా కాకుండా బహుళ ధ్రువంగా ఎదగాలని భారత్ ఆ కాంక్షించటం చూస్తుంటే.. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత బలమైన అంతర్జాతీయ వే దికగా ఆవిర్భవించబోతుందనే సంకేతాలు ఇచ్చినట్లుగానే భావించాలి.
రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ అమెరికాను అధిగమించి ప్రపంచంలో చైనా తర్వాత రెండవ ఆర్థికశక్తిగా ఎదుగుతుందని, ఆసియా ఖం డం ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారుతుందని ప్రఖ్యాత ఆర్థికవేత్త జఫ్రి సాక్స్ అభి ప్రాయపడుతున్నారు. ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణల కోసం బ్రిక్స్ సద స్సు ప్రతిపాదించిన పది అంశాలు కూడా ఈ కూటమి భవిష్యత్తు ప్రత్యేకతను సూచిస్తున్నాయి.
‘బ్రిక్స్’ ప్రతిపాదించిన పది అంశాలు
1. నియమాలను పాటించే వారిగా కాకుండా, అంతర్జాతీయ నియమాలను రూపొందించే స్థాయికి బ్రిక్స్ ఎదగటం
2. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు ప్రాధాన్య మివ్వడం
3. సభ్య దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం
4. అధ్యక్షులు మారినా తీసుకున్న నిర్ణయాలు కొనసాగింపు
5. నిర్ణయాల తీసుకోవడమే కాకుండా వాటి అమలుపై దృష్టి సారించడం
6. పెట్టుబడులు, వాణిజ్యానికి మరింత ప్రోత్సాహం
7. సభ్య దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని విస్తరించడం
8. అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడం
9. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యత పెంచడం
10. బ్రిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చటం..
ఈ సంస్కరణలు ఆచరణలోకి వస్తే ప్రపంచ ఆర్థికవ్యవస్థలో బలమైన కూటమిగా ఎదగటానికి పునాది పడే వీలుంది.
బ్రిక్స్ కూటమి సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అ ధ్యక్షుడు జిన్ పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజస్కీయాన్, యుఎన్‌ఓ జనరల్ సెక్రెటరీ ఆంటోనీయో గుటరస్‌తో భారత ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రా ధాన్యం సంతరించుకుంది. రష్యాతో రక్షణ వాణిజ్య సంబంధాలు మెరుగుపడడం, 2030 నాటికి రష్యాతో వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని నిర్ణయించడం, భారత్‌లో సరిహద్దు సమస్యను పరి ష్కరించుకుంటామని చైనా చెప్పడంతో పాటు భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే అంశం.. భారత్‌కు సానుకూల పరిణామాలు.
బ్రిక్స్ కూటమి లో భారత్ వ్యవస్థాపక సభ్య దేశమైనప్పటికీ బ్రిక్స్ దేశాలకు భారత్ కొనుగోలు మార్కెట్‌గా మారింది. కానీ ఆ దేశాలకు కీలక సరఫరాగా మాత్రం మారలేకపోయింది. భారత్ బ్రిక్స్ దేశాల నుంచి 40 శాతం దిగుమతులు చేసుకుంటే 22 శాతం మాత్రమే ఎగుమతులు చేస్తుంది. ఈ వా ణిజ్య లోటుకు ప్రధాన కారణం చైనా నుం చి చేసుకుంటున్న దిగుమతులే. బ్రిక్స్ దేశాలతో భారత్‌కు వాణిజ్యలోటు ఉంటే అమె రికాతో మాత్రం భారత్‌కు వాణిజ్య మిగు లు ఉంది. కాబట్టి భారత్ వాణిజ్య ప్రయోజనాలు అమెరికాతో కూడా ముడిపడి ఉ న్నాయి.
భారత్ ఏకకాలంలో అటు రష్యా, చైనాతోపాటు అమెరికాతోనూ వా ణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగటానికి అన్ని అవకాశా లున్నాయనే భావనవ్యక్తమవుతోంది. బ్రిక్స్ పశ్చిమదేశాలకు వ్యతిరేకం కాదు.. ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా కాదు అది గ్లోబల్ సౌత్ అభివృద్ధికి కట్టుబడి ఎదుగుతున్న ఒక సమాంతర వ్యవస్థగా భావించాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ, 9885465877