మిర్జాగూడ గేట్ వద్ద రక్తపాతం!
చేవెళ్ల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాగూడ రెవెన్యూ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ రక్తగాయాలతో పడి ఉండటం కలకలం రేపింది. మహిళపై హత్యాయత్నం జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో పర్వేద శంకరయ్య అత్యవసర సహాయ నంబర్ (100)కు ఫోన్ చేసి, మిర్జాగూడ గేట్ వద్ద గుర్తుతెలియని మహిళ రక్తగాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన గస్తీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన మహిళను గుర్తించి చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మహిళపై ఎవరైనా దాడి చేశారా? లేక మరేదైనా కారణంతో గాయపడిందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మహిళ ఆచూకీ, ఆమెకు గాయాలు ఎలా అయ్యాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.