దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద యువకుడు అదృశ్యం!
తెల్లవారుజామున స్నేహితుడితో కలిసి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
ఆచూకీ కోసం మాదాపూర్ పోలీసుల గాలింపు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి(Durgam Cheruvu Cable Bridge) వద్ద ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నాచారంలో నివసిస్తూ కాగ్నిజెంట్ కంపెనీ(Cognizant company)లో సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software Employee)గా పనిచేస్తున్న ఎడుబిల్లి రాజేష్ (25) కనిపించడం లేదని అతని సోదరి ఎడుబిల్లి సంధ్యారాణి ఈ నెల 26న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. అదే రోజు తెల్లవారుజామున 2 నుంచి 2.30 గంటల మధ్య మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితుడి గదికి వెళ్లిన రాజేష్ అక్కడ మద్యం సేవించినట్లు తెలిసింది.
అనంతరం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత అతని ఆచూకీ తెలియకుండా పోవడంతో స్నేహితులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అదృశ్యమైన రాజేష్ ఎత్తు సుమారు 5 అడుగుల 10 అంగుళాలు, తెల్లటి ఛాయ కలిగి ఉంటాడని, చివరిసారిగా ఆకుపచ్చ రంగు టీషర్ట్, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు రాజేష్ ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.