అర్ధరాత్రి వేళ బీభత్సం
కిష్టారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!
సత్తుపల్లి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం(Kistaram Road Accident) గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ లారీ (AP 26 TF 0279) అదుపుతప్పి రోడ్డు మధ్యలోని సెంటర్ డివైడర్‌పైకి ఎక్కింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరగడంతో రోడ్డుపై రద్దీ తక్కువగా ఉండి ప్రాణనష్టం తప్పింది. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
కిష్టారం సెంటర్ ప్రధాన కూడలి కావడంతో పగటిపూట ఈ రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాదాలు జరగకుండా Center Lighting ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని గతంలో సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిష్టారం నుంచి సత్తుపల్లి వరకు రహదారిపై గతంలో జరిగిన ప్రమాదాలు, ప్రాణనష్టాలను గుర్తుచేస్తూ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.