గుడుంబాపై ఉక్కుపాదం

25-10-2026 | 10:29am

గుడుంబా తయారీపై ఎక్సైజ్ దాడులు

ఒకరి అరెస్ట్.. రెండు బెల్ట్‌ షాపులపై కేసులు నమోదు

శివంపేట అక్టోబర్ 25,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలంలోని భీమ్లా తండా గ్రామపంచాయతీ(Bhimla Thanda Gram Panchayat) పరిధిలో శనివారం రాత్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి, రెండు బెల్ట్‌ షాపులపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, తయారీకి సిద్ధంగా ఉంచిన 30 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే అక్రమంగా ఐఎంఎల్‌ మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, 4.32 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌(Excise Inspector) గులాం ముస్తఫా పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ట్రైనీ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు జ్ఞానేశ్వర్‌, సచిరథ, ఎస్‌ఐ డి.శరత్‌ కుమార్‌తో పాటు ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. గుడుంబా తయారీ, అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై సమాచారం ఉంటే ఎక్సైజ్‌ శాఖకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు