వృద్ధ దంపతుల ఆత్మహత్య
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు కుమారులు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు(Elderly couple) పురుగుల మందు తాగి ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గబ్బెట గ్రామానికి చెందిన గైని లక్ష్మి (86), గైని పుల్లయ్య (91) దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. కాలక్రమంలో ముగ్గురు కుమారులు వివిధ కారణాలతో మృతి చెందారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు జీవితంపై విరక్తి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందారు. మృతురాలి కుమార్తె కర్రం లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని రఘునాథపల్లి ఎస్ఐ డి. నరేష్ తెలిపారు.