ప్రేమ జంట మృతి.. కాళ్లకు గొలుసులు, తాళాలు!

10-10-2026 | 04:12pm

తాపీ నదిలో చైన్లతో కట్టేసిన దంపతుల మృతదేహాలు.. అసలేం జరిగింది?

మహారాష్ట్ర: తాపీ నది(Tapi River)లో అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం వేసిన స్థితిలో మృతదేహాలు లభించడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను శ్యామ్ హరి పాటిల్ (28), సప్నా పాటిల్ (20)గా గుర్తించారు.

ప్రేమ వివాహం చేసుకున్న జంట

పోలీసుల సమాచారం ప్రకారం, శ్యామ్ హరి పాటిల్, సప్నా పాటిల్ జల్గావ్ జిల్లాలోని అమళ్‌నేర్ తాలూకాకు చెందినవారు. వీరిద్దరూ కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం(Love marriage) చేసుకున్నట్లు సమాచారం. ధులే జిల్లా(Dhule District)లోని సావల్దే ప్రాంతంలో తాపీ నది అడుగున వారి మృతదేహాలను గుర్తించారు.

కాళ్లకు గొలుసులు.. తాళం కూడా!

దంపతుల కాళ్లను ఇనుప గొలుసుతో బంధించి, దానికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో మృతదేహాలు లభించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అయితే గొలుసులతో కట్టివేసిన పరిస్థితికి గల కారణాలు ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు.

హత్యా? ఆత్మహత్యా?

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతులు ఎలా మరణించారు? ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం మరణాలు హత్యా, ఆత్మహత్యా అనేది నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు