రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేములవాడ,(విజయక్రాంతి): బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొదురుపాక బ్రిడ్జి ఎక్కే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగ శేఖర్ (29) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు నాగ శేఖర్ వేములవాడకు చెందిన ఎండి సోహెల్‌కు సంబంధించిన ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 9 గంటలకు మరో ఆటో కొనుగోలు చేసేందుకు తన యజమాని సోహెల్‌తో కలిసి వెంకట్రావుపల్లి గ్రామానికి వెళ్లాడు.
తిరిగి వస్తున్న సమయంలో ఎండి సోహెల్ ఆటో నంబర్ ఏపీ 01 డబ్ల్యూ 6586 ముందుగా, నాగ శేఖర్ ఆటో నంబర్ ఏపీ15 వై 6316 వెనుకగా వస్తున్నాయి. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో కొదురుపాక రింగ్ రోడ్డు దాటి బ్రిడ్జి ఎక్కే రహదారిపై ఎండి సోహెల్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వస్తున్న నాగ శేఖర్ నడుపుతున్న ఆటో ముందున్న ఆటోను ఢీకొని కుడివైపున పల్టీ కొట్టి ఆటో ముందు అద్దం పగిలి, నాగ శేఖర్ మెడ కుడివైపు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి భార్య నాగ అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయినపల్లి ఎస్సై ఎన్ రమాకాంత్ తెలిపారు.