కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల అభివృద్ధి

02-10-2026 | 12:30pm

స్మార్ట్ రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల

పంపిణీ చేసిన ఎంఎల్ఏ జారే

దమ్మపేట,(విజయక్రాంతి): మండలంలోని పార్కలగండి, పట్వారిగూడెం, అంకంపాలెం గ్రామాల్లోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అశ్వారావుపేట నియోజకవర్గ ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్లపెంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతూ విబిజి రాంజీ ద్వారా గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సమగ్ర ప్రాణాలికలను వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో హర్ ఘర్ జల్ కార్యక్రమంలో పాల్గొని నీటి విలువను ప్రజలకు వివరించారు. నీరు ఎంతో విలువైనదని, రాబోయే తరాలకు నీటిని కాపాడి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

నీటిని అవసరమైన మేరకే వినియోగిస్తూ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు సురక్షితమైన మంచినీటిని మాత్రమే తాగాలని, కలుషిత నీటి కారణంగా అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం తీసుకునే జాగ్రత్తలే భావితరాలకు ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందించి వారి ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరాల రమేష్, తహశీల్దార్(యు/టి డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఆర్ ఐ లు బిక్షమయ్య, వీరస్వామి, గృహనిర్మాణ శాఖ నియోజకవర్గ పరిశీలకులు జి రాము, సర్పంచులు కూరం అర్జున్ రావు, మోకాళ్ళ గురుమూర్తి, కొమరం సుశీల, మడకం వరలక్ష్మి, యూత్ కాంగ్రెస్ దమ్మపేట మండల అధ్యక్షులు కాక రమేష్, వాసం శ్రీను, చిన్నశెట్టి యుగంధర్, బొల్లికొండ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు