ఘనంగా శ్రావణమాస బోనాలు
పినపాక సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పినపాక(Pinapaka) మండలం, జానంపేట(Janampeta) గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్త గుంపు గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ ఘనంగా జరిగింది. గ్రామంలోని ముత్యాలమ్మ, నాగశిల బొడ్రాయి, సారలమ్మ తదితర దేవతలను దర్శించుకుని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాడిపంటలు సక్రమంగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గతంలో మొక్కుకున్న మొక్కులను గ్రామస్తులు ఈ సందర్భంగా చెల్లించుకున్నారు. శ్రావణ మాసం పవిత్రతను చాటేలా మహిళలు ఉత్సాహంగా తలంబ్రాలు, బోనాలతో ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వేడుకల అనంతరం గ్రామస్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.






