నిర్మించారు.. తాళాలు వేశారు!
ప్రజల అవసరాలు పట్టవా?
కౌటాల మార్కెట్, బస్టాండ్లో మూత్రశాలలకు తాళాలు
ప్రజాధనం ఖర్చు చేసినా.. ప్రజలకు అందని సౌకర్యాలు
కౌటాల, అక్టోంబర్ 16 (విజయక్రాంతి): ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి కౌటాల మండల కేంద్రంలోని మూత్రశాలలే(Public Toilets) నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన మూత్రశాలలు వినియోగానికి అందుబాటులో లేకుండా తాళాలకే పరిమితమయ్యాయి. మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో ఒకటి, బస్టాండ్లో మరొకటి.. ఇలా రెండు చోట్ల మూత్రశాలలు ఉన్నప్పటికీ వాటికి తాళాలు వేసి ఉంచడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. ప్రజల సౌక ర్యం కోసం నిర్మించిన నిర్మాణాలే ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి!
కౌటాల మార్కెట్ ప్రాంతానికి నిత్యం వ్యా పారులు, రైతులు, కొనుగోలుదారులు వివి ధ పనుల నిమిత్తం వస్తుంటారు. అలాగే బస్టాండ్కు ప్రయాణికులు, మహిళలు, వృ ద్ధులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో మూత్రశాలలు అందుబాటులో ఉండటం అత్యవసరం. కానీ సౌకర్యాలు ఉన్నప్పటికీ తాళాలు వేసి ఉంచడంతో అవసరమైన సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునేవారే లేరా? అనే ప్రశ్నలు వినిపి స్తున్నాయి.
ప్రజాధనం ఖర్చు చేసి తాళాలు వేయడమెందుకు?
ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేపట్టడం అభినందనీయ మే. అయితే వాటిని నిర్మించడంతోనే బాధ్యత పూర్తయినట్లు కాదు. ప్రజలకు ఉపయోగపడేలా వాటిని అందుబాటులో ఉంచడం, నీటి సదుపాయం కల్పించడం, పరిశుభ్రతను నిర్వహించడం కూడా సంబంధిత అధికారుల బాధ్యత. కానీ కౌటాల మార్కెట్, బస్టాండ్లోని మూత్రశాలలు తాళాలు వేసి ఉండటం చూస్తుంటే నిర్మాణాల నిర్వహణపై ఎంతవరకు దృష్టి సారిస్తున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినా ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటే ఆ సదుపాయాల ఉద్దేశం నెరవేరినట్టేనా? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
పర్యవేక్షణ ఏదీ..బాధ్యత ఎవరిది?
మండల కేంద్రంలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. మూత్రశాలలకు తాళాలు ఎందుకు వేశారు? వాటిని తెరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడానికి కారణాలేమిటి? నిర్వహణ బాధ్యత ఎవరిది? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఉపయోగించుకోలేని సదుపాయాలు ఉన్నా లేనట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితిని గుర్తించాల్సి ఉంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించేనా?
కౌటాల మార్కెట్, బస్టాండ్లోని రెండు మూత్రశాలల తాళాలు వెంటనే తెరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన నీటి సదుపాయం, పరిశుభ్రత, నిర్వహణ చర్యలు చేపట్టి అవి నిరంతరం వినియోగంలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన సదుపాయాలు తాళాల వెనుకే మగ్గిపోతే ప్రజాధనం ఖర్చు చేసిన ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు మరింత బలపడతాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేక ప్రజల ఇబ్బందులు ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.