ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కరపత్రం విడుదల
ఉట్నూర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సమాజంలోని పేద, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండేలా ఉచిత న్యాయ సహాయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) అన్నారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన “ఉచిత న్యాయ సహాయం” అవగాహన కరపత్రాన్ని ప్రాజెక్టు అధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణ 39-ఎ ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించే అవకాశం కల్పించబడిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల ఎవరూ న్యాయం పొందే అవకాశాన్ని కోల్పోకూడదని పేర్కొన్నారు.
ఉచిత న్యాయ సహాయానికి అర్హులు..
జిల్లా న్యాయ సేవా సంస్థ నిబంధనల ప్రకారం కింది వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని పీఓ తెలిపారు.
షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు చెందిన వారు. మానవ అక్రమ రవాణా బాధితులు, బేగారీ బాధితులు.
మహిళలు మరియు పిల్లలు.
మానసిక వైకల్యం లేదా ఇతర అంగవైకల్యం ఉన్నవారు.
సామూహిక విపత్తులు, హింసాకాండ, కుల వైషమ్యాలు, వరదలు, కరువు, భూకంపాలు తదితర ప్రకృతి లేదా పారిశ్రామిక విపత్తుల బారిన పడినవారు.
పారిశ్రామిక కార్మికులు.
వివిధ సంరక్షణ కేంద్రాలు, మానసిక చికిత్సాలయాల్లో ఉన్న వ్యక్తులు.
వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న అర్హత కలిగిన ఇతర వ్యక్తులు.
అందించే న్యాయ సేవలు
అర్హులైన వారికి ఉచిత న్యాయ సలహాలు అందించడం, కోర్టు కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను నియమించడం, అవసరమైన కోర్టు ఫీజులను భరించడం, తీర్పుల నకళ్లను ఉచితంగా అందించడం వంటి న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
*దరఖాస్తు చేసుకునే విధానం...
ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులైన వారు తమ సమస్యకు సంబంధించిన వివరాలతో మండల స్థాయిలో మండల న్యాయ సేవా సంఘం (మండల కోర్టు భవనాలు)ను లేదా జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవా సంస్థ (కోర్టు భవనాలు, ఆదిలాబాద్–504001) కార్యదర్శిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పీఓ సూచించారు.
గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా పేదలు మరియు బలహీన వర్గాలకు చెందిన వారు తమకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన పెంచుకుని, అవసరమైనప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందం కోరారు.