యాదగిరిగుట్టలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
పాల్గొన్న ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, అక్టోబర్ 16 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ(Yadagirigutta Municipality) పరిధిలోని పాత హై స్కూల్ గ్రౌండ్ లో బతుకమ్మ సంబరాలు పండుగ వాతావరణం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆవరణలో తీరొక్క పూలతో బతుకమ్మను పెద్ద ఎత్తున అలంకరించిన మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుండి సాంప్రదాయపద్ధంగా మహిళలు మంగళహారతులతో బతుకమ్మలతో స్వాగతం పలుకుతూ పాత హై స్కూల్ గ్రౌండ్ వరకు తీసుకెళ్లారు.
మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లో భాగంగా బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాలలో మన తెలుగువారు తొమ్మిది రోజులపాటు ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించుకుంటారని మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్,వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముక్యెర్ల మల్లేష్ యాదవ్,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.