పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి.. సేవా జ్యోతి యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలి
ఆలేరు, అక్టోబర్ 2 (విజయక్రాంతి): నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను అర్హులైన ప్రతి పట్టభద్రుడు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Former MP Dr. Boora Narsaiah Goud) పిలుపునిచ్చారు.
భువనగిరి పట్టణంలోని మన్ గార్డెన్స్‌లో జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఓటరు నమోదు కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన పట్టభద్రులు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించి ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
జిల్లా ఇన్‌చార్జి నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 7న నిర్వహించే ‘సేవా జ్యోతి యాత్ర’లో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధాని దేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాశం భాస్కర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, మాయ దాశరధ, పట్నం శ్రీనివాస్, గుడూరు నరోత్తం రెడ్డి, పన్నాల చంద్రశేఖర్, చందా మహేందర్, కొప్పుల యాదిరెడ్డి, కాదురి అచ్చయ్య, పడమటి జగన్మోహన్ రెడ్డి, సుర్వి శ్రీనివాస్, ఆకుతోట రామకృష్ణ,పసులది రాంచందర్, వెంకటేశం, బుల్లెట్ మాధురి, రత్నపురం బలరామ్, కౌన్సిలర్ బండారు స్వర్ణలత, సీత మానస, దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.