100 పడకల ఆసుపత్రి కోసం 500 మందితో కలెక్టరేట్ ముట్టడి!

02-11-2026 | 03:30pm

చౌటుప్పల్ ప్రజల ఆందోళన..

ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం స్పందించరా? ఆసుపత్రి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్

ఆలేరు,(విజయక్రాంతి): చౌటుప్పల్(Choutuppal) పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి(100-bed government hospital) పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది ప్రజలతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్(Yadadri Bhuvanagiri Collectorate) ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై చౌటుప్పల్ ఉండటంతో పాటు, పరిసర గ్రామాలకు ఈ పట్టణం ప్రధాన కేంద్రంగా ఉంది.

జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల కోసం 100 పడకల ఆసుపత్రి ఎంతో అవసరమని ప్రజలు పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావడంతో విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సరైన ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చౌటుప్పల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల వేలాది కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో ELV భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఆసుపత్రి నిర్మాణంతో పాటు అవసరమైన వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బందిని సమకూర్చి పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి!

సుమారు 500 మంది ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగడం చౌటుప్పల్ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవశ్యకతను తెలియజేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆసుపత్రి నిర్మాణ పనుల పూర్తికి స్పష్టమైన గడువు ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ కీలక సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు