ప్రజలకు నాణ్యమైన వైద్యమే ధ్యేయం
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు
కోదాడ అక్టోబర్ 3, (విజయ క్రాంతి) : ప్రజలకు నాణ్యమైన, మెరుగైన ఉచిత వైద్య సేవలు(Free medical services) అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(Tejas Nand Lal Pawar) తెలిపారు. శనివారం కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలలో(Kodada Government Hospital) నూతనంగా నిర్మించిన ఇన్పేషెంట్ విభాగాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(Uttam Padmavathi Reddy), జిల్లా ఎస్పీ నరసింహలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 30 పడకలుగా ఉన్న కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశామని వెల్లడించారు.
దీనికోసం ప్రభుత్వం రూ. 26 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆసుపత్రి పునరుద్ధరణ పనులతో పాటు నూతనంగా నిర్మించిన ఎగ్జిస్టింగ్ బ్లాక్, ఇన్పేషెంట్ విభాగాలు పూర్తికావడంతో వెంటనే ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచే ఆసుపత్రిలో అన్ని రకాల ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినందున కోదాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, రోగులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సహాయం అందించి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని వైద్యాధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, లక్ష్మారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పెండెం వెంకటరమణ, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, డాక్టర్ సుబ్బారావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర వైద్యులు, ప్రజా ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.