వినాయక మండపంలో వినూత్న లక్కీ డ్రా..
బహుమతిగా యూరియా బస్తా!
రైతులకు ఉపయోగపడే బహుమతితో భక్తుల ఆకర్షణ
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 20: మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో వినాయక నవరాత్రోత్సవాల(Vinayaka Navaratri celebrations) సందర్భంగా కోమటిపల్లి యూత్ అసోసియేషన్(Komatipalli Youth Association) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తుల కోసం నిర్వాహకులు లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
ఈ లక్కీ డ్రాలో 3 బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతిగా 5 కిలోల లడ్డు, రెండో బహుమతిగా పట్టుచీర, మూడో బహుమతిగా యూరియా బస్తాను ప్రకటించారు. సాధారణంగా లక్కీ డ్రాలో వేరే బహుమతులు ఉంటే ఇక్కడ రైతులకు ఉపయోగపడే విధంగా యూరియా బస్తాను బహుమతిగా ప్రకటించడంతో గ్రామంలో విశేష స్పందన లభిస్తుంది. యూరియా కొరత నేపథ్యంలో రైతులు పెద్ద సంఖ్యలో కేవలం రూ.49లకే టోకెన్ తీసుకొని లక్కీ డ్రాలో పాల్గొంటున్నారు.