డీజే సౌండ్ ఏర్పాటు చేయరాదు
శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించాలి
చందుర్తి, సెప్టెంబర్ 22,(విజయక్రాంతి): మండలంలో జరగబోయే వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలని చందుర్తి ఎస్ఐ జె రమేష్(SI Ramesh) తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో పరిమితికి మించి డీజే సౌండ్ ఏర్పాటు చేయరాదని అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.
మండపాల నిర్వాహకులు, ప్రజలు, నిర్దేశించిన సమయ పరిమితిలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ఐ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసిన వారిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీస్ శాఖ సూచనలను పాటించి శాంతియుతంగా, సురక్షితంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు.