బిఎల్ఓ కేంద్రాన్ని తనిఖీ చేసిన శ్రీదేవి
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి
నిర్మల్,(విజయక్రాంతి): అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Integrated Revision) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి(Election Observer T.K. Sreedevi) అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra)తో కలిసి ఆమె సమీక్ష చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు.
ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్, అధికారులు, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. మిగిలి ఉన్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మిగిలి ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పరిశీలకులకు సమగ్రంగా వివరించారు. బీఎల్‌ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మిగిలి ఉన్న ఫారాల పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని వివరించారు. నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు.
మరణించిన వ్యక్తుల పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి పూర్తి సహకారం లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా, ఉట్నూర్ సబ్ కలెక్టర్లు అజ్మీరా సంకేత్ కుమార్, ప్రణయ్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.