తక్కువ తడులతో పంటలు అందించాలి
నిర్మల్ అక్టోబర్ 16 ( విజయక్రాంతి): ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ తడులతో సులభంగా సాగయ్యే పంటలను మాత్రమే వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra0 ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సహకారం అందించాలన్నారు. నీటి లభ్యత కారణంగా ఎక్కడైనా పంటలు నష్టపోయినట్లయితే వివరాలను పారదర్శకంగా సేకరించాలని పేర్కొన్నారు.
డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలు కలిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత, ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.