20 వేల ఓట్లను పక్కన పెట్టాలన్న ట్రంప్.. నో చెప్పిన సుప్రీంకోర్టు!

03-11-2026 | 09:34am

అమెరికా: అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపును (Vote Counting) అడ్డుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేశారనే ఆరోపణలతో సుమారు 20 వేల బ్యాలెట్లను (Ballots) పక్కన పెట్టాలంటూ అమెరికా న్యాయశాఖ (US Department of Justice) చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే దిగువ కోర్టులు ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు అనుమతి నిరాకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సమర్పించిన జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని కాలిఫోర్నియా ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఓటర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.తాజా నిర్ణయంతో కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపును అడ్డుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి న్యాయపరంగా అడ్డుకట్ట పడింది.

మరిన్ని వార్తలు