జ్ఞానేశ్ రాజీనామా వరకు పోరాటం ఆగదు : రేవంత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar)పై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం కాంగ్రెస్‌కు సంబంధించిన అంశం కాదని.. ప్రజల ఓటు హక్కుతో ముడిపడిన విషయమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో విపక్షాల ఆందోళన నేపథ్యంలో స్పందించిన రేవంత్ రెడ్డి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై(SIR Voter List Row) కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ప్రస్తావించారు. ప్రజల ఓటు హక్కును ఎన్నికల సంఘం హరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని ఆయన తెలిపారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓట్ల విషయంలో కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సవరించిన జాబితాల్లో తొలగించినట్లు చెబుతున్న ఓట్లను తిరిగి చేర్చాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆయన లేదంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో విపక్ష ఎంపీలు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. అక్టోబర్ 7న జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. దీంతో CECపై విపక్షాల విమర్శలు, ఎన్నికల జాబితా సవరణ అంశం ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన చర్చగా కొనసాగుతోంది. ఓటు హక్కు అంశంపై పోరాటం కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేయడంతో ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది.