జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో రాహుల్ వాగ్వాదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి(INDIA Bloc) ఎంపీలు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకు దిగిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, విపక్ష ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో జంతర్‌మంతర్ పరిసరాల్లో హైటెన్షన్(High Tension) వాతావరణం నెలకొంది.
జంతర్‌మంతర్ వద్ద నుంచి వెళ్లిపోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించినట్లు సమాచారం. అయితే పోలీసుల సూచనలను పట్టించుకోకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం(Election Commission) వ్యవహారంపై నిరసన కొనసాగిస్తామని విపక్ష ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అనుమతి, భద్రతా నిబంధనల నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను నిర్దేశిత ప్రాంతంలోనే నిరసన కొనసాగించాలని సూచిస్తున్నారు.
జంతర్‌మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి, పరిస్థితిని పోలీసులు Monitor చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీలో విపక్షాల నిరసనల నేపథ్యంలో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.