స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 46 మంది మృతి
మాడ్రిడ్: స్పెయిన్(Spain)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హైస్పీడ్ రైళ్లు(High speed train) ఢీకొన్న ఘటనలో 46 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టోలెడో ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో మాడ్రిడ్ నుంచి అండలూసియా ప్రాంతానికి వెళ్లే హైస్పీడ్ రైల్వే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
మోరా, ఓర్గాజ్, ఉర్దా పట్టణాల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ ADIF వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ రెన్ఫేకు చెందిన రైలు, ఐరియో సంస్థకు చెందిన మరో రైలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం కారణంగా స్పెయిన్‌లోని కీలకమైన మాడ్రిడ్–సెవిల్లే హైస్పీడ్ రైల్వే కనెక్షన్(Madrid–Seville high-speed railway connection)పై ప్రభావం పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల సంఖ్యపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, బాధితులకు సహాయం అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ప్రమాదంపై దర్యాప్తు, క్షతగాత్రుల పరిస్థితి, రైల్వే సేవల పునరుద్ధరణకు సంబంధించిన తదుపరి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.