ప్లాస్టిక్‌కు నో.. స్టీల్ పాత్రతో గో!
మల్లాపూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగానికి (Plastic Usage) చెక్ పెట్టేందుకు మొగిలిపేట గ్రామపంచాయతీ చేపట్టిన కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్లాస్టిక్ నిషేధం (Plastic Ban) నిర్ణయానికి ప్రజలు సహకరిస్తూ.. తమ వంతుగా ప్రత్యామ్నాయాలను వినియోగిస్తున్నారు.ఇందులో భాగంగా గ్రామంలోని 5వ వార్డు సభ్యురాలు గంధం కవిత రాజేందర్ ఆదివారం వినూత్నంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిరాకరించారు.
మాంసాహారాన్ని ప్లాస్టిక్ కవర్‌లో తీసుకెళ్లకుండా.. స్టీల్ పాత్రలో (Steel Container) తీసుకెళ్లి గ్రామస్తులకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి (Environment) తీవ్ర నష్టం జరుగుతోందని గంధం కవిత రాజేందర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పునర్వినియోగ వస్తువులను (Reusable Products) ఉపయోగించాలని సూచించారు.ముఖ్యంగా మాంసం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా స్టీల్, గాజు లేదా ఇతర పునర్వినియోగ పాత్రలను ఉపయోగించాలని కోరారు.
గ్రామపంచాయతీ చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామి కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్లాస్టిక్ రహిత గ్రామం (Plastic-Free Village) సాధ్యమవుతుందని అన్నారు.గ్రామాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా (Eco-Friendly) తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వార్డు సభ్యురాలు స్వయంగా స్టీల్ పాత్రను ఉపయోగించడం ద్వారా ఇచ్చిన ఈ సందేశం గ్రామస్తుల్లో చర్చనీయాంశంగా మారింది.