తుషార్ కపూర్‌కు రూ.5 కోట్ల బెదిరింపు

03-11-2026 | 12:45pm

బాలీవుడ్‌లో మరోసారి బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ప్రముఖ నటుడు తుషార్ కపూర్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తుతెలియని వ్యక్తి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వ్యక్తినంటూ ఫోన్ చేయడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బెదిరింపు వెనుక నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా? లేక ఆ ముఠా పేరు ఉపయోగించి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. తుషార్ కపూర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడైన హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్నాడు. రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన నటుడు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ (Anti Extortion Cell), క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

బెదిరింపు కాల్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ను క్రైమ్ బ్రాంచ్ సాంకేతిక బృందం విశ్లేషించింది. హ్యారీ బాక్సర్ అసలు గొంతు నమూనాలతో పోల్చి చూసింది. అయితే కాల్‌లోని గొంతుకు, పోలీసుల వద్ద ఉన్న వాయిస్ శాంపిల్స్‌కు పోలిక కనిపించలేదని సీనియర్ పోలీసు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఇతర ఆడియో నమూనాలతోనూ సరిపోలిక లభించలేదని తెలుస్తోంది.

దీంతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ఉపయోగించుకుని తుషార్ కపూర్‌ను భయపెట్టి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలో కాల్పుల ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ బెదిరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కాల్పుల ఘటనకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం బెదిరింపు కాల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు. కాల్ వచ్చిన నంబర్, సాంకేతిక ఆధారాలు, ఆడియో రికార్డింగ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు కాలేదని సమాచారం. బెదిరింపు వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.

మరిన్ని వార్తలు