కరీంనగర్ గడ్డపై సినిమా.. యువతకు హీరోలయ్యే ఛాన్స్!

24-10-2026 | 11:03am

కరీంనగర్ సిటీ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో త్వరలో సినిమా తెరకెక్కిస్తానని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Director Sampath Nandi) వెల్లడించారు. అవకాశం ఉంటే స్థానిక యువతకు కథానాయకులు, కథానాయికలుగా అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ‘బోగి’ సినిమా (Bhogi Movie) ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లో గుంటపల్లి స్వామి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన సినీ ప్రయాణం, భవిష్యత్తు ప్రాజెక్టులు, తెలంగాణ సంస్కృతిపై తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. కరీంనగర్ బిడ్డగా ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1960 నాటి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామీణ ప్రాంతాల నిజజీవిత పరిస్థితుల ఆధారంగా శర్వానంద్ కథానాయకుడిగా ‘బోగి’ చిత్రాన్ని రూపొందించినట్లు వివరించారు. తెలంగాణ యాస, భాషపై ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కించామని, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించామని చెప్పారు.

భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్న కోరిక ఉందని సంపత్ నంది తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ ప్రాంతంలో సినిమా నిర్మాణం (Film Production) చేపట్టి, స్థానిక ప్రతిభావంతులైన యువతకు సినీ రంగంలో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపార.

ఈ సందర్భంగా నిర్వాహకులు సంపత్ నందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్మాత శ్రీధర్ రెడ్డి, చిరంజీవి అభిమాన సంఘం యువత రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, కాస రాజు పటేల్, మిడిదొడ్డి నవీన్, కేమసారం తిరుపతి, రొడ్డ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు