వాహనాల భద్రత గాలికి!

24-10-2026 | 09:53am

సారపాకలో చిల్లర దొంగల చేతివాటం

ఒకేసారి నాలుగు బ్యాటరీలు మాయం.. యజమానుల్లో ఆందోళన

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో(Sarapaka) వాహనాల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాత్రివేళ ఇళ్ల బయట, రహదారుల పక్కన వాహనాలను నిలిపి ఉంచాలంటేనే యజమానులు ఆందోళన చెందుతున్నారు. భాస్కర్‌నగర్‌లోని ముత్యాలమ్మ గుడి సమీపంలో నిలిపి ఉంచిన నాలుగు వాహనాల్లోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం స్థానికంగా కలకలం రేపింది. వాహనాలను వినియోగించేందుకు ఉదయం వచ్చిన యజమానులు బ్యాటరీలు(Vehicle Batteries Stolen) కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకేసారి నాలుగు వాహనాల బ్యాటరీలు మాయమవడం వాహనదారుల్లో ఆందోళనకు కారణమైంది.

నిఘా పెంచాలని డిమాండ్‌

వాహనాలను బయట నిలిపి ఉంచితే భద్రత లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గస్తీని ముమ్మరం చేసి, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు(Police action) తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో నాలుగు వాహనాల బ్యాటరీలు చోరీకి గురైన నేపథ్యంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉంది. వాహనదారులకు భద్రత కల్పించడంతోపాటు, ఇలాంటి ఘటనల నివారణకు పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు