ఎన్నికల హామీని నెరవేర్చాలి
- మంత్రి జూపల్లిని అడ్డుకున్న కళాకారులు
- సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
- రవీంద్ర భారతిలో కళాకారుల ఆందోళన
ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): సాంస్కృతిక సారధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయా లని డిమాండ్ చేస్తూ కళాకారులు గురువారం రవీంద్రభారతిలో ఆందోళనకు దిగారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని కళాకారులు డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఎన్నో ఏళ్లుగా కళారంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కళాకారులు కన్నీటి పర్యంతమై తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి తమ కుటుంబాలకు భరో సా కల్పించాలని కోరారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కళాకారులు తెలిపారు.