ఆదివాసీ గూడాల్లో జాగేయ్ మాతరి పండుగ

11-09-2026 | 09:48am

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రకృతితో మమేకమైన ఆదివాసీ జీవన విధానానికి ప్రతీకగా నిలిచే జాగేయ్ మాతరి పండుగను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) వ్యాప్తంగా గిరిజనులు ఆదివాసీ గూడాల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం ద్వారా ప్రకృతి పట్ల తమకున్న గౌరవాన్ని, పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలను ఆదివాసీలు చాటుకున్నారు. పొలాల పండుగ(Festival of the Fields) అనంతరం నిర్వహించే జాగేయ్ మాతరి సందర్భంగా ప్రతి గూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సంప్రదాయ వంటకాలు సిద్ధం చేసుకుని పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రకృతి తమను కాపాడాలని కోరుకున్నారు.పండుగలో భాగంగా అడవిలో నుంచి సేకరించి సిద్ధం చేసిన వెదురు గుర్రాలు (కోహడం) ను తీసుకుని గ్రామస్తులంతా సామూహికంగా ఊరి పొలిమేర వైపు బయలుదేరారు.

‘జాగేయ్ మాతరి’ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోకి వ్యాధులు, కీడు, చెడు ప్రభావాలు రాకుండా ఉండాలని ప్రార్థించారు. గ్రామ శివారులోని పవిత్ర చెట్ల కింద వెదురు గుర్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి కుటుంబం తీసుకొచ్చిన నవధాన్యాలు, గారెలు, రొట్టెలు, అన్నం, సద్ది తదితర నైవేద్యాలను ఒకచోట చేర్చి సామూహికంగా పంచుకున్నారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు. దీంతో గ్రామాల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడింది.రాత్రివేళ భజనలు, సంప్రదాయ గీతాలు, పాటలు, నృత్యాలతో జాగారం చేయడం పండుగలో ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా పెద్దలు తమ పూర్వీకుల ఆచారాలు, ప్రకృతితో అనుబంధం, వనమూలికల వినియోగం, సామూహిక జీవన విలువలను యువతకు వివరించారు.ఆధునిక జీవన విధానాల ప్రభావం పెరుగుతున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతుండటం విశేషం. జాగేయ్ మాతరి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా ఆదివాసీ సమాజ చరిత్ర, ప్రకృతి జ్ఞానం, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సజీవ వారసత్వ సంపద.

మరిన్ని వార్తలు