రైతుల ముసుగులో.. గోవుల అక్రమ తరలింపు
వాహనాన్ని అడ్డుకొని.. గోవులను గోశాలకు తరలించిన స్థానిక యువకులు
సింగరేణి అక్టోబర్ 16 విజయ క్రాంతి: రైతుల(Farmers) ముసుగులో.. కొంతమంది వ్యక్తులు గోవులను వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా.. స్థానిక యువకులు వాహనాన్ని వెంబడించి అడ్డుకున్న ఘటన కారేపల్లి - ఇల్లందు ప్రధాన రహదారిలోని సోలార్ ప్లాంట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం ప్రాంతం నుంచి డీసీఎం వాహనంలో సుమారు 15 గోవులను(cows), ఇల్లందు, మహబూబాబాద్ వైపు కొంతమంది వ్యక్తులు తరలిస్తుండగా. . గమనించిన కారేపల్లి యువకులు వాహనాన్ని వెంబడించి, సోలార్ ప్లాంట్ వద్ద అటకాయించారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఇల్లందు గో సంరక్షణ సమితి సభ్యులు, కారేపల్లి విశ్వహిందూ పరిషత్తు సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని. . గోవులను తరలిస్తున్న వ్యక్తులను నిడదీశారు. తాము రైతులమని చెప్పుతూ పొంతన లేని సమాధానాలతో పాటు, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో. . గోవులను వాహనంతో పాటు ఖమ్మంలోని గొల్లగూడెం గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి సభ్యులు ,విశ్వహిందూ పరిషత్తు సభ్యులు జంగా వెంకటేశ్వర్లు, వైభవ్ మనియార్ తదితరులు పాల్గొన్నారు.