కరీంనగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
ముకరంపుర, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): కరీంనగర్ లో తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల విగ్రహం వద్ద జరిగిన వర్థంతి వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండ లక్ష్మణ్ బాపుజీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో బాపూజీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడన్నారు. బహుజనుల, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అనితరసాధ్యమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాసాల రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, తేల్ల లక్ష్మి రమేష్, మాసం గణేష్, పాడిశెట్టి వసంత లక్ష్మీ, భూమయ్య, చొప్పరి జయశ్రీ వేణు, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం నాయకులు మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.