మట్టి గణపతుల పంపిణీ
ముకరంపుర, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): వినాయక చవితి పండగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.
అదేవిధంగా 22వ, 50వ డివిజన్ల పరిధిలోని చైతన్యపురి కాలనీలో, 14వ డివిజన్ చింతకుంటలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాల్లోనూ మేయర్ పాల్గొని ప్రజలకు విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో మట్టి గణపతి విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మేయర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, గడ్డి ప్రదీప్, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.