ప్రభుత్వానికి నిర్ణీత గడువులో బియ్యం అప్పగించేందుకు సిద్ధం
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తా
కామారెడ్డి,(విజయక్రాంతి): రైస్ మిల్లర్ లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులో అప్పగిస్తామని కామారెడ్డి డివిజన్(Kamareddy Division) రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తా తెలిపారు. మంగళవారం జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని బిల్లింగ్ ప్రక్రియ పై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలోని మిల్లర్లతో పలుసార్లు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినట్లు తెలిపారు. రైస్ మిల్లర్ పై పదే పదే ఒత్తిడి తేవడం వల్ల బిల్లింగ్ వ్యవస్థ దెబ్బ తింటుందన్నారు. మిల్లర్ల సమస్యల వాస్తవాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. రైస్ మిల్లర్లు, అధికారులు, నిపుణులతో కలిసి సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మిల్లింగ్ పై స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. రైతులకు మిల్లర్లకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్, మాజీ కార్యదర్శి గౌరీశెట్టి గౌరీ శంకర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు, రవీందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.