సుప్రీంకోర్టు స్పందన హర్షణీయం: బండి తిరుపతి
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి) : ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి నోటీసులు జారీ చేయడం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(Private Teachers Forum) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బండి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కీలకమైన విద్యారంగంలో ప్రైవేటు ఉపాధ్యాయులు విశేషమైన కృషి చేస్తున్నప్పటికి వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. అర్హతకు తగిన జీతాలు లేకపోవడం, ఈఎస్ఐ, ఈపీఎఫ్, గ్రాటివిటీ వంటి సౌకర్యాలు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లేకపోవడంతో నిత్యం మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు.