ఎంజీఎం లో స్లాబ్ పైకప్పు పెచ్చులు పడి రోగులకు గాయాలు

20-09-2026 | 08:10pm

హనుమకొండ, సెప్టెంబర్ 20(విజయ క్రాంతి): ఎంజీఎం ఆస్పత్రిలో(MGM Hospital) ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్(55)తో పాటు అటెండర్లు ఎల్లమ్మ(50),ఓంకార్ (33) అనే ముగ్గురు బాధితులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం, జఫర్గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వార్డులో ఉన్న ఇతర రోగులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

గాయపడ్డ వారిని వెంటనే పక్కనే ఉన్న మరో వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆరోగ్యశ్రీ వార్డును తాత్కాలికంగా మూసివేసి లోపల శిథిలాలను సిబ్బంది శుభ్రం చేశారు. ఆసుపత్రి భవనం నిర్వహణపై ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత భవనం కావడం పైకప్పు నుంచి నీరు లీకేజీ అవ్వడం వల్ల స్లాబ్ పెచ్చులు ఊడి పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఉత్తర తెలంగాణకు తలమానికం అయినటువంటి ఎంజీఎం ఆసుపత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజీఎం) ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రమైన మౌలిక వసతులు లేమి, పర్యవేక్షణ లోపంతో కొట్టుమిట్టాడుతుంది.

మరిన్ని వార్తలు