ఆక్రమణలకు చెక్.. రహదారులకు ఊపిరి!

08-10-2026 | 10:52am

హనుమకొండ, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): నగరంలో రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి నగరంలోని గోపాలపూర్ కల్లుమండువా జంక్షన్, చింతగట్టు క్యాంపు, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్, ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారుల పరిస్థితి, ట్రాఫిక్, ఆక్రమణలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి: రీసర్వే స్పీడ్‌అప్.. రైతుల భూ సమస్యలకు చెక్!

రహదారికి ఇరువైపులా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు తదితర ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులను ఆదేశించారు. రహదారుల వెంట ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రమాదాలకు అవకాశం ఉన్నందున, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అదేవిధంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణను కూడా కలెక్టర్ పరిశీలించారు. రహదారులు, ప్రధాన కూడళ్లు, పరిసర ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. రహదారుల వెంట ఆక్రమణలను గుర్తించి తొలగించడంతో పాటు, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: మనవడి బర్త్‌డే.. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వే

ఈ కార్యక్రమంలో సిఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ రాజ్‌కుమార్, సీహెచ్వో లక్ష్మారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రెడేకర్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఈఈ రవికుమార్‌తో పాటు ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు