ఘోర ప్రమాదం.. కాలువలో పడిన బస్సు, 8 మంది మృతి!

17-10-2026 | 10:22am

న్యూఢిల్లీ: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటా జిల్లా సిమ్లియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పడంతో రహదారిపై నుంచి సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

కాలువలో నీరు ఎక్కువగా ఉండటంతో పాటు బురద పేరుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్రేన్‌ (Crane) సాయంతో బస్సును బయటకు తీసి, అందులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుండటంతో మిగిలిన వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మినీ బస్సు అదుపుతప్పడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. సహాయక చర్యలు పూర్తయ్యాక ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు