అక్టోబర్‌లోగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యం
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
కమలాపురం పంప్‌హౌస్ నుంచి అన్నదైవం ప్రాజెక్టుకు నీటి విడుదల
ములకలపల్లి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్(Sathupalli Trunk)కు గోదావరి జలాలను అందించి రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు.సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించారు.ములకలపల్లి మండలం కుమ్మరిపాడు గ్రామంలో ఎస్‌టీఎస్‌డీఎఫ్ నిధులతో రూ.4కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి, బీటీ రోడ్డును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడంతో పాటు అన్ని కాలాల్లో రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో సీతారామ ఎత్తిపోతల పథకంలోని మూడో పంప్‌హౌస్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తో కలిసి పరిశీలించి,మోటార్‌ను ఆన్ చేసి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.పంప్‌హౌస్ నుంచి విడుదలైన నీటి ప్రవాహాన్ని పరిశీలించి,నీటి విడుదలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.విమానాశ్రయానికి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధమైన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు,రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.