భద్రాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయం సంక్షోభం
ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం
ఏఐకేఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (Telangana State Farmers Association) జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కు డిమాండ్ల వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాధం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం(Agricultural Sector) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు.
అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు, కౌలు రైతులకు అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్, సంఘం నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, సలిగంటి శ్రీనివాస్, వి.పూర్ణచందర్ రావు, వై ఎస్ గిరి, గుర్రం వెంకటేశ్వర్లు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.