బోణీ కొట్టేదెవరో?

04-11-2026 | 05:20am

నేడు భారత్,కివీస్ తొలి వన్డే

  1. రోహిత్,కోహ్లీ పైనే అందరి చూపు
  2. భారత బ్యాటర్లకు సవాల్
  3. న్యూజిలాండ్‌కు గాయాల దెబ్బ

* సుధీర్ఘమైన కివీస్ టూర్‌లో టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐదు వన్డేల సిరీస్ ఆడబోతోంది. టీ20 సిరీస్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టుకు రోహిత్,కోహ్లీ ఎంట్రీ మరింత బలాన్నిచ్చింది. విదేశీ గడ్డపై గిల్ కెప్టెన్సీకి ఈ సిరీస్ పరీక్ష కానుండగా, గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్ ఏ మేరకు భారత్‌ను అడ్డుకుంటుందో చూడాలి.

ఆక్లాండ్, నవంబర్ 3 : భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్(India vs New Zealand ODI series) బుధవారం నుంచే మొదలుకాబోతోంది. వన్డే ప్రపంచకప్‌కు(ODI World Cup) అత్యుత్తమ కాంబినేషన్‌ను సిద్ధం చేసుకునే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. టీ20 సిరీస్(T20 Series) విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత్ తొలి వన్డే గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Rohit Sharma, Virat Kohli) రీఎంట్రీ ఇస్తుండటంతో మరింత క్రేజ్ నెలకొంది. వచ్చే వరల్డ్ కప్ ఆడాలని పట్టుదలగా ఉన్న రోకో ద్వయం ఈ సిరీస్ లో చెలరేగాలని ఎదురుచూస్తోంది.

కోహ్లీకి కివీస్ గడ్డపై మంచి రికార్డు ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తుది జట్టు విషయానికొస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. రాహుల్ కీపర్ గానూ బాధ్యతలు తీసుకోనున్నాడు. అటు టీ20 సిరీస్‌లో రాణించిన నమన్ ధీర్‌కు అవకాశం దక్కనుండగా, పేస్ ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి ఆడబోతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను తిప్పికొట్టేందుకు మిడిలార్డర్లో వ్యూహాత్మక మార్పులు చేయనున్నారు.

5, 6 స్థానాల కోసం స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ కాకుండా మ్యాచ్ పరిస్థితులను బట్టి కేఎల్ రాహుల్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అక్షర్ పటేల్ స్థానాలను మార్చనున్నారు . క్రీజులో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అవసరమైతే అక్షర్ పటేల్‌ను ముందుకు పంపే అవకాశం ఉంది.హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ప్రకారం జట్టులో బ్యాటింగ్ లోతును పెంచడం కోసం కనీసం ముగ్గురు ఆల్‌రౌండర్లతో భారత్ బరిలోకి దిగనుంది. నితీశ్ కుమార్ రెడ్డి ,అక్షర్ పటేల్, మరియు నమన్ ధీర్ వంటి ఆల్‌రౌండర్ల్లు జట్టులో ఉండటంతో 8వ స్థానం వరకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.

అక్షర్ పటేల్ స్పిన్ భారాన్ని మోయనుండగా.. పేస్ విభాగంలో బుమ్రా లేకపోవడం లోటే. దీంతో అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్‌ను లీడ్ చేయబోతున్నాడు. అతనితో పాటు మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. మైదానం చిన్నది కావడం,బ్యాటింగ్ డెప్త్ వ్యూహం వల్ల వన్డే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది. మరోవైపు టీ20 సిరీస్ కోల్పోయినా చివరి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ అదరగొట్టింది.

భారత్కు క్లీన్ స్వీప్ అవకాశం ఇవ్వకుండా చివరి రెండు టీ20లు గెలిచింది. ఇప్పుడు అదే జోష్ తో వన్డే సిరీస్ లోనూ అదరగొట్టేందుకు సిద్ధమైంది. కివీస్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ కు ముందే రచిన్ రవీంద్ర, చాప్‌మన్ లాంటి స్టార్లు దూరమవగా, ఇప్పుడు ప్రాక్టీస్‌లో కాన్వే గాయపడి తొలి వన్డే నుంచి వైదొలిగాడు.

అయితే సొంతగడ్డపై కివీస్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. ఓవరాల్ రికార్డుల్లో భారత్ దే పైచేయిగా ఉన్నప్పటకీ కివీస్ గడ్డపై మాత్రం వెనుకబడింది. న్యూజిలాండ్‌లో 45 వన్డేలు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. అయితే ఆక్లాండ్ పిచ్ బౌండరీలు చిన్నవిగా ఉండడంతో హై స్కోరింగ్ మ్యాచ్ ఖాయమని అంచనా.

తుది జట్ల అంచనా

భారత్ : గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, నితీశ్ రెడ్డి, సిరాజ్, గుర్నూర్ బ్రార్, అర్షదీప్ సింగ్

న్యూజిలాండ్ : సిఫెర్ట్, విల్ యంగ్, డారిల్ మిఛెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, డఫీ, మ్యాట్ హెన్రీ

మరిన్ని వార్తలు